‘నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు కానీ..’ టెస్ట్ రీ-ఎంట్రీపై కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

  • టెస్ట్ క్రికెట్ లోకి పునరాగమనం ప్రసక్తే లేదన్న కోహ్లీ
  • ఢిల్లీలో తన బ్రాండ్ 'One8' కొత్త షూ కలెక్షన్ లాంచ్
  • కోహ్లీ మొత్తం టెస్ట్ పరుగులే బూట్ల ధర 
  • 2025 మేలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ వస్తాడంటూ కొన్నిరోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తాను టెస్ట్ ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకున్నానని, మళ్లీ వైట్ జెర్సీ ధరించే ఆలోచనే లేదని తేల్చిచెప్పాడు. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో జరిగిన తన సొంత స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ 'One8' కొత్త షూస్ కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌లో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రముఖ హోస్ట్, కమెడియన్ డానిష్ సైత్ అడిగిన ఒక సరదా ప్రశ్నకు కోహ్లీ నవ్వుతూనే స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చాడు.

ఈ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ప్రత్యేకమైన రెడ్ కలర్ బూట్ల ధరను రూ. 9,230గా నిర్ణయించారు. దీనిపై హోస్ట్ డానిష్ సైత్ స్పందిస్తూ.. కోహ్లీ టెస్ట్ కెరీర్ మొత్తం పరుగులు కూడా సరిగ్గా 9,230 కావడాన్ని గుర్తు చేశాడు. "మీ బ్రాండ్ బూట్ల విక్రయాలను, లాభాలను మరింతగా పెంచడానికి మీరు మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడి మరికొన్ని పరుగులు చేస్తారా?" అని డానిష్ సరదాగా ప్రశ్నించాడు. దానికి కోహ్లీ స్పందిస్తూ.. "నా బూట్లు తక్కువ ధరకే అమ్ముడైనా పర్లేదు కానీ.. నేను ఆ ఫేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాను. థాంక్యూ" అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో కొన్ని వారాలుగా కోహ్లీ కోచ్ చేసిన వ్యాఖ్యలతో తెరపైకి వచ్చిన రీ-ఎంట్రీ వార్తలకు పూర్తిగా బ్రేక్ పడింది.

విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు 2025 మే నెలలో గుడ్‌బై చెప్పాడు. మొత్తం 123 టెస్ట్ మ్యాచ్‌లలో 46.85 సగటుతో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 9,230 పరుగులు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచిన కోహ్లీ.. 68 మ్యాచ్‌లలో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం 37 ఏళ్ల కోహ్లీ.. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారిస్తున్నాడు. ఇటీవల హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌కు దూరమైన విరాట్.. జూలైలో ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు.

Virat Kohli
Test cricket retirement
One8 shoe launch Delhi
Virat Kohli Test runs
Indian cricket news
Danish Sait interview

More Telugu News